ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను ఆదేశాలను ధిక్కరించి జగిత్యాల పట్టణంలో ఉద్యమ తెలంగాణ తల్లి ఏర్పాటుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పూనుకున్నారు. ఆదివారం నాడు భారీ ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి భూమి పూజ నిర్వహించారు.ఆదివారం నాడు ఎమ్మెల్సీ కవిత జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ కార్యకర్తలు గజమాలతో ఘనస్వాగతం పలికారు. అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… ప్రభుత్వం ఎన్ని జీవోలు, గెజిట్ లు జారీ చేసినా ఉద్యమ తెలంగాణ తల్లినే తాము ప్రతిష్టించుకుంటామని తేల్చిచెప్పారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉద్యమకాలంలో తెలంగాణ తల్లి తమకు స్పూర్తిని ఇచ్చిందని, ధైర్యాన్ని నింపిందని తెలియజేశారు.