అరెస్టులతో సరిపెట్టకుండా సినిమా పైరసీకి కారణమైన సర్వీస్ ప్రొవైడర్స్‌పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.
ఆయన ఒక ప్రకటనలో సినిమా పైరసీకి కారణమైన డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ లపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేతిరెడ్డి మాట్లాడుతూ “ఐ-బొమ్మ అనే వెబ్సైట్ ద్వారా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 500 చిత్రాలు పైరసీ చేయబడ్డాయని, ఈ నేరంలో పాలుపంచుకున్న వారిని తెలంగాణ పోలీసులు బీహార్, పూణే, తమిళనాడులో అదుపులోకి తీసుకోవడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. విచారణలో తెలిసిన వివరాలు సినీ రంగానికి షాక్ ని ఇచ్చాయని, కొన్ని సినిమాలను థియేటర్లలో కామ్ కార్డర్ ద్వారా రికార్డు చేశారని, అంతే కాకుండా డిజిటల్ ప్రొవైడర్స్ అయిన UFO, Qube ల సైట్లను కూడా హ్యాక్ చేసి, విడుదలకు ముందే దాదాపు 120 చిత్రాలను నేరుగా డౌన్లోడ్ చేసినట్లు బీహార్‌లోని గోపాలగంజ్కు చెందిన A1 నిందితుడు అశ్విన్ కుమార్ తన వాంగ్మూలంలో వెల్లడించాడని నిర్మాతలు తమ సినిమాలను పూర్తి చేసిన తర్వాత కంటెంట్‌ను డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ప్రొవైడర్స్‌కి అందజేస్తారని వీరు ఒకే కోడ్‌తో అన్ని థియేటర్లకు ప్రొజెక్షన్ కోసం అప్లోడ్ చేస్తారని అయితే ఈ సైట్లను కూడా హ్యాక్ చేయడం వల్లే పెద్ద నష్టం జరిగిందన్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ సకాలంలో చేయకపోవడం, భద్రతా పరమైన చర్యలు పాటించకపోవడం వలన ప్రొడ్యూసర్లు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
అదే సమయంలో నిర్మాతల వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్న డిజిటల్ ప్రొవైడర్ల నిర్లక్ష్య వైఖరి పట్ల మరియు వారు దీనిపై సమాధానం ఇవ్వడమే కాకుండా, నష్టపరిహారం కూడా చెల్లించాలని తాము డిమాండ్ చేస్తున్నాం అని ఆయన తెలిపారు. పోలీసుల వద్దనున్న ఆధారాల ప్రకారం, పైరసీ వల్ల నష్టపోయిన నిర్మాతలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని లేనిపక్షంలో నిర్మాతలు సంఘటితంగా పోరాటానికి సిద్ధమవుతారని ఆయన హెచ్చరించారు సినిమా రంగం కోట్లాది కుటుంబాలకు జీవనాధారంగా ఉందని, అయితే ఆన్లైన్ సినిమా పైరసీ కారణంగా నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, కళాకారులు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. ఈ దారుణానికి ప్రధాన కారణం పైరసీ వెబ్సైట్లు మరియు వాటికి సహకరిస్తున్న కొన్ని సర్వీస్ ప్రొవైడర్లు, సినిమా పైరసీని ప్రోత్సహిస్తున్న సర్వీస్ ప్రొవైడర్లపై కఠినమైన చర్యలు ప్రభుత్వం వెంటనే తీసుకోవాలన్నారు. పైరసీ వెబ్సైట్లను బ్లాక్ చేయడం, హోస్టింగ్ సర్వీసులు, డొమైన్ ప్రొవైడర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం, పైరసీ ద్వారా లాభాలు పొందుతున్న వారిని గుర్తించి ప్రత్యేక ఆర్థిక నేరాల చట్టం (PMLA, IT Act) కింద చర్యలు తీసుకోవడం, సినిమా పరిశ్రమ రక్షణ కోసం సైబర్ క్రైమ్ స్పెషల్ సెల్ ఏర్పాటు చేసి దానిని, 24/7 గంటలు మానిటరింగ్ చేయాలి అన్నారు. సినిమా కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతల కష్టార్జిత ఫలాన్ని దోచే పైరసీ మాఫియాను తక్షణమే నిర్మూలించాలని ఆయన కోరారు. అలాగే, ఇటీవల సోషల్ మీడియాలో ఇబొమ్మ ఇచ్చిన అల్టిమేటం (2023లో చేసిన ఒక X పోస్ట్) గురించి ప్రస్తావిస్తూ “సినీ తారల పారితోషికాలు, డైరెక్టర్స్ ఫీజులు, నిర్మాణ వ్యయాలపై మాట్లాడే హక్కు అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించే పైరసీ దారులకు లేదన్నారు, చట్టవిరుద్దంగా పనులు చేసే వారు పరిశ్రమ భవిష్యత్తు గురించి మాట్లాడకూడదు” అని కేతిరెడ్డి హితవు పలికారు.