హైదరాబాద్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ఇటీవల ఐఐటీ హైదరాబాద్‌లో విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు, వివాదానికి దారి తీసింది. యువతులు తమ వృత్తిపరమైన లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి ‘ఎగ్ ఫ్రీజింగ్’ (అండాల సంరక్షణ) ఉత్తమమైన భీమా అని ఆమె చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో, వైద్య వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వివాదాస్పద వ్యాఖ్య ఏమిటి?
ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన కెరీర్ కౌన్సెలింగ్ సెషన్‌లో ఉపాసన మాట్లాడుతూ, నేటి యువతులు వివాహం కంటే తమ కెరీర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో, మహిళలకు అతిపెద్ద ఇన్సూరెన్స్ ఏమిటంటే, అది తమ అండాలను ఫ్రీజ్ చేసుకోవడమేనని ఆమె సలహా ఇచ్చారు.
”మహిళలకు అతిపెద్ద భీమా (Largest Insurance) తమ అండాలను సంరక్షించుకోవడమే. ఎందుకంటే, అప్పుడు మీరు ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నప్పుడు, మీ సొంత నిబంధనల ప్రకారం ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లలను కనాలి అనే నిర్ణయాన్ని మీరే తీసుకోవచ్చు,” అని ఉపాసన పేర్కొన్నారు.
తాను కూడా 29 ఏళ్ల వయసులో వ్యక్తిగత, ఆరోగ్య కారణాల దృష్ట్యా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నానని, 36 ఏళ్లకు మొదటి బిడ్డ క్లీంకారకు జన్మనిచ్చి, ప్రస్తుతం 39 ఏళ్ల వయసులో కవలల కోసం ఎదురుచూస్తున్నానని తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు.
ఉపాసన వ్యాఖ్యలపై ఆన్‌లైన్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా, ‘ఎగ్ ఫ్రీజింగ్’ ప్రక్రియ లక్షల్లో ఖర్చుతో కూడుకున్నది, ఇది అపారమైన ఆర్థిక స్థోమత ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుందని, సాధారణ మధ్యతరగతి మహిళలకు ఇది ఆచరణ సాధ్యం కాదని నెటిజన్లు, పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు.
”ఆర్థికంగా బలంగా ఉన్నవారు మాత్రమే ఇటువంటి సలహాలు ఇవ్వగలరు. ఈ ఖరీదైన ప్రక్రియ సాధారణ యువతులకు ఎలా ఉపయోగపడుతుంది?” అని కొందరు ప్రశ్నించగా, మరికొందరు వైద్యులు జీవశాస్త్రపరంగా 35 ఏళ్లు దాటిన తర్వాత గర్భధారణలో సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందని, ఎగ్ ఫ్రీజింగ్ విజయవంతం అవుతుందనే గ్యారెంటీ లేదని హెచ్చరించారు. అంతేకాకుండా, ఆమె వ్యాఖ్యలు అపోలో ఫెర్టిలిటీ వ్యాపారాన్ని పెంచే ప్రయత్నంలో భాగమేనని కొందరు విమర్శించారు. అంతే కాకుండా సగటు భారతీయ మహిల యొక్క సగటు జీవనశైలి, వాస్తవిక పరిస్ధితుల ఆధారంగా కాకుండా పరిపక్వత లేని విదంగా ఉపాసన వ్యాఖ్యలు ఉన్నాయని పలువురు విమర్శలు గుప్పించారు.
వివాదం తీవ్రరూపం దాల్చడంతో, ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చారు. తన వ్యాఖ్యలు ఒక ‘ఆరోగ్యకరమైన చర్చ’కు దారి తీసినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
”ఒక మహిళ సమాజ ఒత్తిడికి లొంగకుండా ప్రేమ కోసం పెళ్లి చేసుకోవాలని, సరైన భాగస్వామి కోసం వేచి చూడాలని కోరుకోవడం తప్పా? ఆమె తన పరిస్థితులకు అనుగుణంగా పిల్లలు ఎప్పుడు కావాలి అని నిర్ణయించుకోవడం తప్పా? కెరీర్, వివాహం రెండు ముఖ్యమే. కానీ, ఆ సమయాన్ని (Timeline) నేనే నిర్ణయించుకుంటాను. అది అధికారం (Privilege) కాదు, నా హక్కు (My Right),” అని ఆమె గట్టిగా సమాధానమిచ్చారు.
మహిళలకు వృత్తి, కుటుంబం రెండూ ముఖ్యమేనని, రెండింటి మధ్య సమన్వయం సాధించడానికి ఎగ్ ఫ్రీజింగ్ ఒక సాధనంగా ఉపయోగపడుతుందని ఆమె పునరుద్ఘాటించారు. ఈ చర్చ ద్వారా యువతకు సరైన అవగాహన కలుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.