​జనజీవన స్రవంతిలోకి రండి.. పునర్నిర్మాణంలో భాగస్వాములు కండి: రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

Share Now

​హైదరాబాద్: “హింస ద్వారా సాధించేదేమీ లేదు.. చర్చల ద్వారానే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో 130 మంది మావోయిస్టులు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలోకి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు, ఈ సందర్భంగా మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటు అజ్ఞాతంలో ఉన్న ఇతర నాయకులకు ఆయన కీలక విజ్ఞప్తి చేశారు. మారణాయుధాలు వీడి మనసు మార్చుకొని ప్రభుత్వం పిలుపు మేరకు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA)కి చెందిన 130 మంది సభ్యులు ఏకే-47లు, ఇన్సాస్ రైఫిళ్లు వంటి భారీ ఆయుధాలతో లొంగిపోయారు. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో సమస్యలను పరిష్కరించుకోవచ్చని వారు గ్రహించడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు.


ప్రభుత్వ భరోసా: ఆరోగ్యం, చట్టపరమైన సహాయం అజ్ఞాతంలో ఉన్న నాయకులు, సభ్యులకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ఈ క్రింది హామీలను ఇచ్చారు:
ప్రాణ రక్షణ: లొంగిపోయే ప్రతి ఒక్కరికీ పూర్తి ప్రాణ రక్షణ కల్పిస్తాం. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం.
ఆరోగ్య బాధ్యత: వయసు పైబడిన వారు, అనారోగ్యంతో ఉన్నవారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తాం. ప్రభుత్వం వారి ఆరోగ్యానికి పూర్తి బాధ్యత వహిస్తుంది.
న్యాయ సహాయం: గతంలో ఉన్న కేసుల విషయంలో ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తుంది. వారిపై ఉన్న కేసులను సమీక్షించి, మెరుగైన జీవితం కోసం అవసరమైన అన్ని రకాల చట్టపరమైన సహాయాన్ని అందజేస్తాం.
పునరావాసం: ఇందిరమ్మ ఇళ్లు, ఆర్థిక ప్యాకేజీ మరియు జీవనోపాధి కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది.
​తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం
​ “తెలంగాణ సమాజం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఈ పునర్నిర్మాణ ప్రక్రియలో మీరు కూడా భాగస్వాములు కావాలి, అజ్ఞాతవాసాన్ని వీడి మీ కుటుంబ సభ్యుల వద్దకు చేరుకుని ప్రశాంత జీవనం గడపాలి” అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మార్చి 31, 2026 లోపు దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
​ఈ కార్యక్రమంలో డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని, లొంగిపోయిన వారికి పునరావాస పత్రాలను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *