తిరుపతి, జనవరి 2026: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన సీబీఐ (CBI) నేతృత్వంలోని ప్రత్యేక విచారణ బృందం (SIT) తన సుదీర్ఘ దర్యాప్తును పూర్తి చేసి, తాజాగా నెల్లూరులోని ఏసీబీ కోర్టులో 219 పేజీల తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది.
తిరుమల లడ్డూ కల్తీ కేసు: సీబీఐ సిట్ (SIT) సంచలన నివేదిక
గత కొద్ది కాలంగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముగిసింది. సుమారు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో జరిపిన విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- 36 మందిపై అభియోగాలు: ఈ కుంభకోణంలో మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో టీటీడీ మాజీ అధికారులు, డైరీ యజమానులు, మరియు రసాయన సరఫరాదారులు ఉన్నారు.
- రూ. 250 కోట్ల కుంభకోణం: 2019 నుండి 2024 మధ్య కాలంలో ఉత్తరాఖండ్‌కు చెందిన ‘భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ’ సుమారు 68 లక్షల కిలోల నకిలీ నెయ్యిని సరఫరా చేసినట్లు సిట్ నిర్ధారించింది. దీని విలువ సుమారు 250 కోట్ల రూపాయలు.
- పాలు లేకుండానే నెయ్యి తయారీ: సదరు డెయిరీ అసలు ఒక్క లీటరు పాలు కూడా సేకరించకుండానే, కేవలం కెమికల్స్ మరియు ఇతర నూనెలతో కృత్రిమ నెయ్యిని తయారు చేసినట్లు సీబీఐ గుర్తించింది.
ఛార్జ్‌షీట్ ప్రకారం, తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు (బీఫ్ ట్యాలో లేదా లార్డ్) ఉన్నట్లు శాస్త్రీయంగా ఆధారాలు లభించలేదని సిట్ పేర్కొంది.
జంతువుల కొవ్వు ఉందా? క్లారిటీ ఇచ్చిన నివేదిక
”పరీక్షించిన నమూనాలలో పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ వంటి వెజిటబుల్ ఫ్యాట్స్ మరియు బీటా కెరోటిన్ వంటి రసాయనాలు కలిశాయి తప్ప, జంతువుల కొవ్వు కల్తీ కాలేదని” నివేదిక స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేయగా, టీటీడీ మాజీ ప్రొక్యూర్‌మెంట్ జీఎం సబ్రమణ్యం సహా మరికొందరు ప్రస్తుతం జైలులో ఉన్నారు. కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం కొందరు టీటీడీ సిబ్బంది ప్రైవేట్ డైరీలతో కుమ్మక్కయ్యారని, హవాలా మార్గంలో భారీగా డబ్బు చేతులు మారిందని సిట్ ఆరోపించింది”.
సిట్ నివేదికతో ఏపీ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత ప్రభుత్వంపై జంతువుల కొవ్వు ఆరోపణలు చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అయితే, “జంతువుల కొవ్వు ఉన్నా లేకపోయినా, పాలు లేకుండా కృత్రిమ నెయ్యి వాడటం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే” అని కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
సిట్ తన బాధ్యతను పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో, ఇప్పుడు బంతి కోర్టులో ఉంది. పవిత్రమైన శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం తలపెట్టిన అసలైన దోషులకు ఎలాంటి శిక్ష పడుతుందో వేచి చూడాలి.
సాక్షాత్తూ కలియుగ దైవం శ్రీనివాసుని సన్నిదిని కూడా ఈ అవినీతి పరులు వదలలేదు అంటే, న్యాయస్ధానం త్వరిత గతిన విచారణ జరిపి వీరిని కఠినంగా శిక్షించి, భక్తుల మనో భావాలు దెబ్బతినకుండా చూడాలి. అలాగే రాజకీయ నాయకుల మితి మీరిన వ్యాఖ్యలతో ఇలాంటి విషయాలలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించి తిరుమల సన్నిది పవిత్రతను కాపాడవలసిన భాధ్యత అందరిపై ఉంది. అలాగే పలు ఆరోపణలు ఏదుర్కొంటున్న TTD లో ప్రక్షాలన జరగాలి అని పలువురు భక్తులు కోరుకుంటున్నారు.