మాగుంట ఆధ్వర్యంలో ఘణంగా ఓంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ల పండుగ

Share Now

ఒంగోలు, సెప్టెంబర్,27 : ఒంగోలు మున్సిపాలిటీ 150 సంవత్సరాల వసంతోత్సవ వేడుకలు నగరంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని నగరంలో భారీ ‘హెరిటేజ్ వాక్’ (వారసత్వ నడక) కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.

నగరంలోని మంగమూరు రోడ్డు జంక్షన్ నుండి చర్చి సెంటర్ వరకు సాగిన ఈ హెరిటేజ్ వాక్‌లో వేలాది మంది విద్యార్థులు, నగర ప్రముఖులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశ, ప్రాంతీయ సంస్కృతీ సంప్రదాయాలు, ఒంగోలు నగర ప్రగతిని చాటిచెప్పేలా విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సంబరాల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు, మరియు సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బి.ఎన్. విజయకుమార్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని, జెండా ఊపి నడకను ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి వారు కూడా ఉత్సాహంగా అడుగులు వేశారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. 150 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒంగోలు మున్సిపాలిటీ అభివృద్ధిలో సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తోందని కొనియాడారు. నగర వారసత్వాన్ని, సంస్కృతిని కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *