హైదరాబాద్: ప్రముఖ క్యూయర్ డేటింగ్ యాప్ ‘గ్రిండర్’ (Grindr) ద్వారా వ్యక్తులకు పరిచయమై, నమ్మకం గొలిపి, బీరులో మత్తుమందు కలిపి బంగారం, విలువైన వస్తువులను దోచుకుంటున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో డాక్టర్‌తో పాటు మొత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి భారీ ఎత్తున బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి వెల్లడించిన వివరాల ప్రకారం..
నేరస్థుల వివరాలు:
అరెస్టైన నిందితులను బాలానగర్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి తేజావత్ సంతోష్ (25), బాలానగర్‌కు చెందిన డాక్టర్ రెడ్డిగారి దినేష్ కుమార్ రెడ్డి (32), మొయినాబాద్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి మొహమ్మద్ ఆరిఫ్ (24), అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థులు బానోతు విద్యాసాగర్ (21), బానోతు కార్తీక్ (18)గా గుర్తించారు. ఈ ముఠాలో ‘చందు’ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల్లో ఒకరైన ఆరిఫ్ టాలీవుడ్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తూ పలువురిని మోసం చేసినట్లు విచారణలో తేలింది.
నేరానికి పాల్పడే తీరు:
నిందితులు గ్రిండర్ యాప్‌లో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, తాము కూడా ఎల్జీబీటీక్యూఏ+ (LGBTQIA+) వర్గానికి చెందినవారినని నమ్మబలికేవారు. యాప్‌లో చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా పరిచయాలు పెంచుకుని.. ఒంటరిగా ఉంటున్న వారిని, ఒంటిపై బంగారు ఆభరణాలు ధరించే వారిని టార్గెట్ చేసేవారు. తర్వాత బాధితుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారితో కలిసి బీరు తాగేవారు. ఒకరు బాధితుడి దృష్టిని మరల్చగా, మరొకరు రహస్యంగా బీరులో మత్తుమందు కలిపేవారు. బాధితులు మత్తులోకి జారుకున్న తర్వాత వారి వద్ద ఉన్న బంగారం, విలువైన వస్తువులను దోచుకుని పరారయ్యే వారు. కొన్ని సందర్భాల్లో విలువైన వస్తువులు లేకపోతే, వారి వ్యక్తిగత వీడియోలను రహస్యంగా రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు కూడా పోలీసులు తెలిపారు.
14 కేసులు గుర్తింపు – భారీగా బంగారం రికవరీ:
ఉప్పల్ మెట్రో స్టేషన్ సమీపంలో, ఏఎస్ రావు నగర్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు సోమవారం ఈ ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి విచారణలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 3 కేసులు, సైబరాబాద్‌లో 7, హైదరాబాద్‌లో 3, విశాఖపట్నంలో 1 కలిపి మొత్తం 14 కేసులతో వీరికి సంబంధం ఉన్నట్లు తేలింది. నిందితుల నుంచి సుమారు 3.61 కేజీల (35 తులాలకు పైగా) బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై బీఎన్‌ఎస్ (BNS) చట్టంలోని సెక్షన్లు 61 (నేరపూరిత కుట్ర), 111 (సంఘటిత నేరం), 127, 123 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
పోలీసుల హెచ్చరిక (పబ్లిక్ అడ్వైజరీ):
- ఆన్‌లైన్‌లో పరిచయమయ్యే వ్యక్తులతో ఇష్టపడినా లేదా ఆకర్షణతో వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, ఇంటి చిరునామాలు పంచుకోవద్దు.
- ఆన్‌లైన్ పరిచయాలతో తొలిసారి కలుసుకునేటప్పుడు ఎప్పుడైనా రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలను (Public Places) మాత్రమే ఎంచుకోవాలి.
- అవతలి వారి గుర్తింపును సరిగ్గా ధృవీకరించుకోవాలని, అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వెంటనే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
- అత్యవసర సహాయం కోసం వెంటనే 112 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.