సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ నియామకం

Share Now

న్యూడిల్లీ: సుప్రీమ్ కోర్టు తదుపరి, 53వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సూర్య కాంత్ గారిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పదవీ విరమణ అనంతరం, నవంబర్ 24, 2025 నుంచి జస్టిస్ సూర్య కాంత్ గారు బాధ్యతలు చేపట్టనున్నారు.

ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ గారు, సంప్రదాయం ప్రకారం సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సూర్య కాంత్ పేరును తన వారసుడిగా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేశారు. ఈ సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదముద్ర వేశారు.

జస్టిస్ సూర్య కాంత్ గారు సుమారు 15 నెలల పాటుగా, 2027 ఫిబ్రవరి 9 వరకు భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించనున్నారు. హర్యానాకు చెందిన ఆయన, ఈ అత్యున్నత న్యాయ పదవిని చేపట్టనున్న తొలి వ్యక్తి కానున్నారు. 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్ జిల్లాలో జన్మించినారు, 1984లో న్యాయవిద్యను పూర్తి చేసిన ఆయన, 2000 సంవత్సరంలో హర్యానా రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు తరువాత 2004లో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా సేవలందించారు, ఆ తర్వాత 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు, తదనంతరం 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

జస్టిస్ సూర్య కాంత్ గారు తన నాలుగు దశాబ్దాల న్యాయ జీవితంలో పలు కీలకమైన రాజ్యాంగ, సివిల్ మరియు మానవ హక్కుల కేసులలో ముఖ్యమైన తీర్పులు వెలువరించారు. ఆర్టికల్ 370 రద్దు, పౌర స్వేచ్ఛకు సంబంధించిన అంశాలు, మరియు సెడిషన్ చట్టంపై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు వెలువరించిన ధర్మాసనాలలో ఆయన సభ్యులుగా ఉన్నారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, జస్టిస్ సూర్య కాంత్‌కు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనందుకు తన శుభాకాంక్షలు తెలియచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *