కృష్ణ చైతన్య విద్యా సంస్థలపై దాడులు.. ప్రశ్నించే గొంతు నొక్కడమే లక్ష్యం!

Share Now

నెల్లూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, విపక్షాల గొంతు నొక్కడమే ధ్యేయంగా రాజకీయం చేస్తోందని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఇన్ ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకే, కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి చెందిన కృష్ణ చైతన్య విద్యాసంస్థలపై దాడులు చేయించారని వారు ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో కానీ లేదా సిబిఐ విచారణ గాని జరిపించాలని అంతేకానీ ప్రశ్నించే వారిపై కక్ష పూరితంగా ఇలాంటి చర్యలకు పాల్పడడం కూటమి ప్రభుత్వ దుష్ట పరిపాలనకు నిదర్శనం అని పలువురు నేతలు విమర్శించారు.

నెల్లూరు జిల్లాలో సుమారు 70 కాలేజీలు ఉండగా, వాటిని వదిలిపెట్టి కేవలం చంద్రశేఖర్ రెడ్డి గారి విద్యాసంస్థలపైనే దాడులు చేయడం వెనుక స్పష్టమైన రాజకీయ కోణం ఉందని నేతలు ఆరోపించారు. కృష్ణ చైతన్య సంస్థలకు చెందిన ఆరు జూనియర్ కళాశాలల బ్రాంచ్‌లలో శనివారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11:30 గంటల వరకు అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు. విద్యాసంస్థలను అడ్డుపెట్టుకుని విద్యార్థులను, తల్లిదండ్రులను భయాందోళనలకు గురిచేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పి. నారాయణకు చెందిన విద్యాసంస్థలను తామెప్పుడూ ఇబ్బంది పెట్టలేదని గుర్తుచేశారు. నారాయణ విద్యాసంస్థల గుర్తింపు లేదా అనుమతుల రద్దు వంటి చర్యలకు తమ ప్రభుత్వం దిగలేదన్నారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం రెండు రోజుల్లోనే నిబంధనల పేరుతో నోటీసులు ఇచ్చి, దాడులకు దిగడం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు.

ఈ దాడులను ఖండిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో 18 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *