రాప్తాడు బాలికల ఉన్నత పాఠశాలలో నరమేధం..

Share Now

అనంతపురం/రాప్తాడు: రాప్తాడు జెడ్పీ హైస్కూల్‌లో జరిగిన అమానుష ఘటనపై ప్రజల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తరగతి గదిలో పాఠాలు వింటున్న పదో తరగతి విద్యార్థినిపై ఒక దుండగుడు చెట్లు నరికే చైన్‌సా (యాంత్రిక రంపం)తో లోపలికి చొరబడి దారుణంగా దాడికి తెగబడటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. హంతకుడు యదేచ్చగా నరమేధం సృష్టించి చక్కగా బైక్ పై పారిపోగలిగాడు అంటే మనం ఏ కాలంలో బ్రతుకుతున్నాం, దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా తీవ్రంగా గాయపడటం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ రోజు ఉదయం స్కూల్‌లో క్లాసులు జరుగుతున్న సమయంలో హేమంత్ అనే 21 ఏళ్ల యువకుడు ఏలక్ట్రిక్ రంపంతో తరగతి గదిలోకి ప్రవేశించాడు. ఉపాధ్యాయుడి సమక్షంలోనే సదరు విద్యార్థినిపై ముఖం, మెడ, చేతులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలో బాలిక చేయి తెగిపోగా, ముఖం మరియు మెడపై తీవ్ర గాయాలయ్యాయి. తోటి విద్యార్థిని కాపాడబోగా ఆమెకు కూడా గాయాలయ్యాయి. పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతుండటంతో వర్కర్ అనుకుని భద్రతా సిబ్బంది అతడిని లోపలికి అనుమతించినట్లు తెలుస్తోంది. చిన్న పిల్లలు చదివే పాఠశాలలో భద్రతా లోపాలపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంపై జగన్ ధ్వజం:
ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలకు రక్షణ లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజకీయ కక్షసాధింపులు, ‘రెడ్ బుక్’ పాలనపైనే శ్రద్ధ పెట్టారని, దీనివల్ల నేరస్థులకు చట్టం పట్ల భయం లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ భద్రతా వైఫల్యానికి పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

సీఎం స్పందన.. నిందితుడి అరెస్ట్
ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి తల్లితో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. గాయపడిన విద్యార్థినులకు మెరుగైన అత్యవసర వైద్య చికిత్స అందించాలని, అవసరమైతే బెంగళూరు తరలించాలని అధికారులను ఆదేశించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. కాగా, ఘటన అనంతరం పారిపోయిన నిందితుడు హేమంత్‌ను ధర్మవరం రైల్వే స్టేషన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *