నెల్లూరు, ప్రకాశం జిల్లాల జీవనాడి అయిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది. నెల్లూరు జిల్లాలో వైస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైసిపి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సిపి ఇతర నియోజకవర్గ సమన్వయకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన దిశగా భవిష్యత్తులో అవలంబించాల్సిన కార్యచరణపై సమావేశంలో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగ హక్కులను చంద్రబాబు నాయుడు తెలంగాణకు తాకట్టుపెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అటకెక్కించారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వలాభం కోసం నదీ జలాలను, రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టడంలో చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య అని చెప్పడంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెద్ద ఉదాహరణ గా చెప్పుకోవచ్చన్నారు.
కృష్ణానది నికర జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడితే, దానిని చంద్రబాబు నాయుడు దుర్మార్గపు రాజకీయాలతో ప్రాజెక్టును తన స్వలాభం కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కీర్తి వస్తుందోనన్న దుర్బుద్ధితోనే చంద్రబాబు నాయుడు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని పలువురు వక్తలు మండిపడ్డారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు నిలిపి వేసే విధంగా తెలంగాణ రైతాంగాన్ని రెచ్చగొట్టి కేసులు పెట్టించిన నీచపు సంస్కృతి చంద్రబాబు నాయుడుదని దుయ్యబట్టారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం తిరిగి ప్రారంభించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందని వైకాపా నేతలు తీర్మానించారు.