న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన న్యూఢిల్లీలో ‘రిజర్వేషన్ హఠావో’ (రిజర్వేషన్లను తొలగించండి) ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. వివిధ వర్గాలకు చెందిన వేలాది మంది నిరసనకారులు శనివారం జంతర్ మంతర్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. కుల ఆధారిత రిజర్వేషన్ల వ్యవస్థను రద్దు చేసి, కేవలం ఆర్థిక ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టారు.
దేశవ్యాప్తంగా ఉన్న పలు విద్యాసంస్థల విద్యార్థులు, యువజన సంఘాలు, మేధావులు మరియు సాధారణ ప్రజలు ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వాలి”, “కుల రహిత సమాజాన్ని స్థాపించాలి” అంటూ నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుత రిజర్వేషన్ల విధానం వల్ల అర్హులైన, ప్రతిభావంతులైన జనరల్ కేటగిరీ విద్యార్థులకు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ మరియు పార్లమెంట్ పరిసర ప్రాంతాలలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించారు. నిరసనకారులు ప్రధాన రహదారులపైకి రావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించి, రిజర్వేషన్ల విధానంపై పునఃసమీక్ష జరిపేలా ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసేంత వరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదని ఉద్యమ నిర్వాహకులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ హఠావో ఉద్యమానికి Gen Z ఉద్యమ నేత కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే మద్దతు తెలుపక పోవడం కుల పరంగా రిజర్వేషన్ల పట్ల నేతకు ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది తేటతెల్లమవుతుంది.