బెంగళూరు : దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోని ఆస్తుల వివాదం మరోసారి న్యాయస్థానం మెట్లెక్కింది. బెంగళూరులోని యలహంక నివాసంలోకి (యలహంక ప్యాలెస్) తన సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రవేశించకుండా నిరోధించాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేవనహళ్లి కోర్టును ఆశ్రయించగా. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఇంజంక్షన్ ఉత్తర్వులు (Interim Injunction) జారీ చేసినట్లు సమాచారం.
వివాదానికి ప్రధాన కారణం:
షర్మిల తన కుమార్తె అంజలీ రెడ్డి వివాహ పనుల నిమిత్తం లేదా పెళ్లి ఆహ్వాన పత్రిక అందించడానికి వైఎస్ షర్మిల తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని యలహంక నివాసానికి వెళ్లనున్నారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో షర్మిల యలహంక ప్యాలెస్‌లో బస చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో జగన్ వర్గం ముందస్తుగా న్యాయపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
కోర్టులో వాదనలు, ఉత్తర్వులు:
‘సిలికాన్ బిల్డర్స్ లిమిటెడ్’ పేరుతో బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి కోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది. సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న యలహంక నివాసం తన భార్య భారతి రెడ్డి కుటుంబానికి (అత్తగారు సుగుణమ్మ) చెందినదని, షర్మిలకు ఆ ఆస్తిపై ఎటువంటి హక్కులు లేవని పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం.
భద్రతా సిబ్బంది ద్వారా నేరుగా షర్మిల ప్రవేశాన్ని అడ్డుకుంటే అనవసర ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని భావించి, కోర్టు ద్వారా స్టే లేదా ఇంజంక్షన్ ఉత్తర్వులు పొందేందుకు జగన్ వర్గం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం షర్మిల ఆ నివాసంలోకి ప్రవేశించకుండా కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసినది.