మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరియు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంయుక్తంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కీలకమైన ప్రతిష్టాత్మక రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (Rayalaseema Global Horticulture Hub) నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు.
ఈ మెగా ప్రాజెక్టును మూడు విడతల్లో దాదాపు రూ. 1 లక్ష కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఇందులో ప్రభుత్వ పెట్టుబడి రూ. 40,352 కోట్లు కాగా, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా రూ. 60,000 కోట్లు సమకూరనున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా 10 జిల్లాలు, 201 క్లస్టర్ల పరిధిలోని ఉద్యానవన రంగానికి, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు భారీ ఊతం లభించడమే కాకుండా రైతుల ఆదాయం రెట్టింపు కానుంది.
అనంతరం మదనపల్లెలో ఏర్పాటు చేసిన భారీ కూటమి బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో ఈ హబ్ నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. తాను ఆంధ్రా కోడలినని చెప్తూ సభను ఉద్దేశించి ఉత్సాహంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ సంస్థల అధినేత అనంత్ అంబానీ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఆయన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి గురించి వివరిస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు అహర్నిశలు పాటుపడుతున్న తీరుని కొనియాడారు. ఈ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.