దుబాయ్/టెల్ అవీవ్: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ (Flydubai – FZ1073) విమానంలో మిడ్-ఎయిర్ టెర్రర్ హైజాక్ యత్నం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించింది. గాల్లో వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో విమాన కాక్‌పిట్ లోపల కో-పైలట్ ఒక్కసారిగా ఘోర రక్తపాతానికి తెగబడ్డాడు. విమానాన్ని కూల్చేందుకు ఒమన్ దేశానికి చెందిన డిప్యూటీ పైలట్ చేసిన కుట్రను, భారతీయ ప్రధాన పైలట్ సమయస్ఫూర్తి మరియు ఇజ్రాయెల్ ప్రయాణికుల ధైర్యం కలిసి తిప్పికొట్టాయి. ఈ హైజాక్ డ్రామా వివరాలు ఇలా ఉన్నాయి.
కాక్‌పిట్‌లో కో-పైలట్ కత్తితో దాడి
విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఒమన్‌కు చెందిన కో-పైలట్ అకస్మాత్తుగా తీవ్రవాద ధోరణితో విమానాన్ని క్రాష్ (కూల్చివేయడానికి) చేయడానికి ప్రయత్నించాడు. దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన భారత సంతతికి చెందిన ప్రధాన పైలట్ స్మిత్ మచ్చార్ పై కో-పైలట్ కత్తితో ఘోరంగా దాడి చేశాడు. పైలట్‌ను కత్తితో పదే పదే పొడవడంతో ఆయన తీవ్ర రక్తస్రావంతో గాయపడ్డారు. తీవ్రంగా గాయపడినప్పటికీ, భారతీయ పైలట్ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ప్రయాణికుల ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా పోరాడారు.
కేవలం ఒకే నిమిషంలో వేల అడుగుల కిందకు..
దాడి జరిగిన సమయంలో విమాన నియంత్రణ కోల్పోవడంతో, కేవలం ఒకే నిమిషంలో విమానం వేల అడుగుల కిందకు పడిపోయింది. ఆ సమయంలో కాక్‌పిట్ లోపల గందరగోళం, అరవడం ప్రయాణికులకు వినిపించింది. తీవ్ర గాయాలతో ఉన్నప్పటికీ, భారత పైలట్ చాకచక్యంగా కాక్‌పిట్ తలుపులను తెరిచి ప్రయాణికులకు సిగ్నల్ ఇచ్చారు. వెంటనే విమానంలో ఉన్న నలుగురు ఇజ్రాయెల్ ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లి, దాడికి తెగబడిన ఒమన్ కో-పైలట్‌ను గాయపరిచి, బంధించారు.
అలర్ట్ అయిన ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు
ఈ ఘర్షణ సమయంలో విమానం నుండి అత్యవసర సిగ్నల్స్ వెళ్లాయి. మొదట జనరల్ ఎమర్జెన్సీ కోడ్ 7700, ఆ తర్వాత విమానం హైజాక్ లేదా చట్టవిరుద్ధమైన జోక్యానికి గురైనప్పుడు ఇచ్చే అంతర్జాతీయ ట్రాన్స్పాండర్ కోడ్ 7500 ను విమానం ప్రసారం చేసింది. దీంతో ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెెంజమిన్ నెతన్యాహు సైతం అత్యవసర సమీక్ష నిర్వహించారు.
సౌదీ అరేబియాలో సేఫ్ ల్యాండింగ్
విమానంలోని అదనపు క్రూ సిబ్బంది మరియు ప్రయాణికులు కలిసి విమానాన్ని తమ అదుపులోకి తెచ్చుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియా వైపు మళ్లించి, అక్కడ ఉన్న తబూక్ విమానాశ్రయంలో అత్యవసరంగా సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న 174 మంది ఇజ్రాయెల్ ప్రయాణికులతో పాటు మొత్తం 180 మంది సురక్షితంగా బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్‌కు విమానంలో ఉన్న ఒక ఇజ్రాయెల్ వైద్య నిపుణుడు ప్రాథమిక చికిత్స అందించి రక్తం కారకుండా ఆపగలిగారు. ప్రస్తుతం ఆయన సౌదీ అరేబియాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం. ప్రయాణికులందరినీ ప్రత్యేక విమానంలో మంగళవారం రాత్రి తిరిగి బెన్-గురియన్ విమానాశ్రయానికి చేర్చారు. ప్రాణాలకు తెగించి 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై అంతటా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సంఘటనతో దుబాయ్ నుంచి బయలుదేరే పలు విమాన సర్వీసుల లో ప్రయాణికుల భద్రతపై నీలి నీడలు కమ్ముకున్నాయి.