జరుగుమల్లి (ప్రకాశం జిల్లా): రైతుల భూములకు భద్రత కల్పిస్తూ, వారి హక్కులను సుస్థిరపర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, జరుగుమల్లి మండలం పరిధిలోని నరసింగోలు గ్రామంలో అక్టోబర్ 9, 2026 (శుక్రవారం)న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రీ-సర్వే 2.0 పూర్తయిన భూములకు సంబంధించి, ప్రభుత్వ అధికారిక రాజముద్రతో కూడిన సరికొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు.
భూమి మీదే – హక్కు మీదే: సీఎం చంద్రబాబు నాయుడు
సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తూ, గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన వివాదాస్పద ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేసి, రైతుల ఆస్తులకు పూర్తి రక్షణ కల్పించామని పునరుద్ఘాటించారు. “గతంలో పాస్ పుస్తకాలపై ఎవరిదో బొమ్మలు ఉండేవి, కానీ మా కూటమి ప్రభుత్వం అధికారిక రాజముద్రతో అత్యంత పటిష్టమైన భద్రతా ఫీచర్లతో నూతన పాస్ పుస్తకాలను అందిస్తోంది” అని వివరించారు.
రైతులు తమ భూముల భద్రత గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేవలం పంటల సాగు మరియు ఉత్పాదకతపైనే దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రెవిన్యూ కార్యాలయాల చుట్టూ రైతులు తిరిగే పని లేకుండా, పారదర్శకంగా భూ హక్కులను కల్పించడమే ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. కొండపి నియోజకవర్గ పరిధిలో వేలాది మంది రైతులకు దీని ద్వారా లబ్ధి చేకూరనుందని ఆయన సభాముఖంగా తెలిపారు.
మంత్రుల ప్రసంగాలు & విప్లవాత్మక మార్పులు
రెవిన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్ గారు మరియు స్థానిక మంత్రి శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు మాట్లాడుతూ, ప్రతి నెల 9వ తేదీన ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తూ రైతులకు జవాబుదారీగా ఉంటున్నట్లు తెలిపారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు జిల్లా అభివృద్ధికి, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
కార్క్రమం అనంతరం కొండపి నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు మరియు కార్యకర్తలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. నరసింగోలు గ్రామ చరిత్రలో ఈ కార్యక్రమం రైతుల పాలిట ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో మరియు బహిరంగ సభలో పాల్గొన్న ప్రముఖులు:
- గౌరవ మంత్రివర్యులు: ప్రకాశం జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవిన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్య ప్రసాద్ గారు.
- పార్లమెంట్ & శాసనసభ్యులు: ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డ్ చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారు, కనిగిరి శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారు.
- ఉన్నతాధికారులు: ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ రాజ బాబు గారు, జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారు.
వీరితో పాటు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, కూటమి పార్టీల ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు మరియు రైతాంగం ఈ సభను విజయవంతం చేశారు.
