నెల్లూరు టౌన్, 9 అక్టోబర్ : బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహిళా పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నిరసనలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి మరియు మహిళా మోర్చా ప్రతినిధులు పాల్గొని, రాహుల్ గాంధీ చర్యలను తీవ్రంగా ఖండించారు.
రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలి: చిలకల ప్రవీణారెడ్డి
నిరసన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు చిలకల ప్రవీణారెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ మహిళా పోలీసులపై ఉద్దేశపూర్వకంగా అసభ్యంగా ప్రవర్తించిన తీరును దేశమంతా చూసి నిర్గాంతపోయిందని మండిపడ్డారు. దేశంలోని మహిళలంతా ఈ చర్యను ముక్తకంఠంతో ఖండిస్తున్నారని, అందుకే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన రాహుల్ గాంధీ తక్షణమే మహిళా పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి మహిళలపై గౌరవం లేదు: వంశీధర్ రెడ్డి
బీజేపీ జిల్లా అధ్యక్షులు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళా హక్కులను, మహిళా బిల్లును వ్యతిరేకిస్తూనే వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో మహిళలకు సమాన గౌరవం, అవకాశాలు కల్పించిన దాఖలాలు లేవని, ఆ పార్టీ మొదటి నుంచి మహిళలను అగౌరపరుస్తోందని విమర్శించారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు: సురేందర్ రెడ్డి
రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికార యావతో ప్రధాని మోదీపై అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఓట్ చోరీకి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చనిపోయిన వారి ఓట్లను, అక్రమ వలసదారుల ఓట్లను అధికారులు తొలగిస్తుంటే ఎలక్షన్ కమిషన్‌ను వ్యతిరేకించడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ మహిళా నాయకురాలు రాజేశ్వరమ్మ, ఏ.ఎం.సి డైరెక్టర్ ప్రసన్నమ్మ, ప్రధాన కార్యదర్శులు కవిత, హరిత, శివ పార్వతి, సుజన మరియు పెద్ద సంఖ్యలో మహిళా మోర్చా నారీమణులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.