న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘చలో పార్లమెంట్’ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నీట్ (NEET) పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అలాగే సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా సుమారు 20 వేల మంది నిరసనకారులు ఢిల్లీ వీధుల్లోకి వచ్చారు.
జంతర్ మంతర్ వద్ద భారీగా మోహరించిన ఆందోళనకారులు పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కాంపౌండ్ గోడలు ఎక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించిన CJP కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు నిరసనకారులపై విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారు, టియర్ గ్యాస్ (భాష్పవాయువు) ప్రయోగించారు.
ఈ భారీ ఆందోళనల కారణంగా కన్నాట్ ప్లేస్, పరిసర ప్రాంతాలలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ తర్వాత జంతర్ మంతర్ నిరసన స్థలాన్ని పోలీసులు పూర్తిగా ఖాళీ చేయించారు. కాగా, తీవ్ర ఉద్రిక్తతల నడుమ కేంద్ర మంత్రి జె.పి. నడ్డా, CJP ప్రతినిధులతో సమావేశమై వారి డిమాండ్లపై చర్చలు జరిపారు.