అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా 13 కోవిడ్-19 పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో వైద్య ఆరోగ్య శాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది. జూన్ 26 నుంచి జూలై 16 మధ్య కాలంలో ఈ కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ వైరస్ బారిన పడి రాష్ట్రంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసులు రాష్ట్రంలో నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఎక్కడా సామూహికంగా వైరస్ వ్యాప్తి చెందలేదు. కరోనా సోకిన వారిలో నలుగురు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మరణించిన వారిలో ముగ్గురు కడప జిల్లాకు, ఒకరు కాకినాడకు చెందిన వారని అయితే, మరణించిన వారంతా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో (బీపీ, మధుమేహం, కిడ్నీ వ్యాధులు) బాధపడుతున్నట్లు వైద్య శాఖ స్పష్టం చేసింది.
- వైఎస్ఆర్ కడప జిల్లా: రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడ 8 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది తొలి కోవిడ్ కేసు జూన్ 26న కడపలోనే గుర్తించారు.
- గుంటూరు జిల్లా: ఇక్కడ 3 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
- విశాఖపట్నం: ఒక కేసు నమోదైంది.
- కాకినాడ: ఒక కేసు నమోదైంది.