ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామకాల్లో భారీ కుంభకోణం జరిగిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి జగన్ పలు సంచలన ప్రశ్నలు సంధించారు. “చంద్రబాబు గారూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన ‘దగా డీఎస్సీనా’? అసలు ఇందులో పారదర్శకత ఎక్కడ ఉంది?” అని జగన్ నిలదీశారు.
జగన్ సంధించిన ప్రధాన ప్రశ్నలు.. ఆరోపణలు:
- పేపర్ లీకేజీలు – మెరిట్ లిస్ట్ మాయం: పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని, డేటాబేస్ నుండి టాపర్ల వివరాలను డిలీట్ చేశారని జగన్ ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఒక SCERT అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చిందని, ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుండి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.
- రహస్యంగా మెసేజ్‌లు: ఎంపికైన అభ్యర్థుల జాబితాలను కలెక్టరేట్ కార్యాలయాల్లో అధికారికంగా ప్రదర్శించకుండా, కేవలం ఎంపికైన వారికి మాత్రమే నేరుగా ఫోన్లకు మెసేజ్‌లు పంపడం వెనుక ఉన్న మతలబు ఏంటని నిలదీశారు.
- స్పోర్ట్స్ కోటాలో భారీ అవినీతి: క్రీడా మైదానంలో అడుగుపెట్టని వారికి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి, రూ. 15 లక్షలకు స్పోర్ట్స్ కోటా పోస్టులను అమ్ముకున్నారని జగన్ సంచలన ఆరోపణ చేశారు. ఇది రిక్రూట్‌మెంటా లేక వేలం పాటా? అని విమర్శించారు.
- అధికారుల ఆకస్మిక మార్పు: టెట్ (TET) కన్వీనర్‌గా ఉన్న అధికారినే డీఎస్సీ కన్వీనర్‌గా ఉంచినప్పటికీ.. ఉన్నపళంగా ఆయన్ను తప్పించి విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు నియమించాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
తన సుపుత్రుడైన నారా లోకేష్ పరిధిలోని విద్యాశాఖలోనే ఈ ‘డార్క్ ఆపరేషన్’ అంతా సాగిందని, లీకులకు బాధ్యత వహిస్తూ లోకేష్‌ను తక్షణమే మంత్రి పదవి నుంచి తప్పించాలని జగన్ డిమాండ్ చేశారు.
సీబీఐ విచారణకు డిమాండ్
గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసి, కేవలం పబ్లిసిటీ కోసం కొత్త నోటిఫికేషన్ ఇచ్చి చివరకు నిరుద్యోగులకు ద్రోహం చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ఈ మెగా డీఎస్సీ స్కామ్‌పై తక్షణమే సీబీఐ (CBI) దర్యాప్తు జరిపించాలని, ప్రతిభ గల అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ మరియు కూటమి ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందోనని నిరుద్యోగ వర్గాల్లో ఉత్కంఠత నెలకొంది. న్యాయ నిపుణులు ఈ విషయంపై వైసిపి పార్టీ పూర్తి స్థాయిలో కోర్టుల ద్వారా న్యాయ పోరాటం చేయవలెనని కోరుచున్నాను, లేదంటే ప్రతిభ మరియు అర్హత కలిగిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోవురణి విన్నవించు చున్నారు.