రావులపాలెం, ఆగస్టు 24: నూకరాజు, ఆయన భార్య, కుమార్తె ఆత్మహత్య ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి ఆరోపించారు. సాదిక్ అనే వ్యక్తితో పాటు మరో తొమ్మిది మంది కలిసి ఈ కుట్రకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర పోలీసుల దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
సాదిక్ ఒక ఉగ్రవాద గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్నట్లు తనకు సమాచారం ఉందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కాకినాడ, రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో మరో 15 కుటుంబాలను కూడా ఈ గ్రూప్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అయితే పరువు, సామాజిక ప్రతిష్ట దృష్ట్యా ఆ కుటుంబాలు పూర్తి వివరాలను బయటకు వెల్లడించేందుకు ముందుకు రావడం లేదని ఆయన తెలిపారు.
సాదిక్‌తో పాటు అతని గ్రూప్‌కు కెనడా, అరబ్ దేశాలతో సహా అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయని విజయసాయిరెడ్డి తెలిపారు. మత మార్పిడులు, తుపాకుల సరఫరా, బెదిరింపులు, వసూళ్లు, ఉగ్రవాద కార్యకలాపాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ వ్యవహారం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాలకు కూడా విస్తరించి ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో కేసును CBI లేదా NIAకి అప్పగించాలని కోరుతున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తుతో నూకరాజు కుటుంబం ఘటనతో పాటు సాదిక్ గ్రూప్‌పై ఉన్న ఇతర ఆరోపణల్లోనూ వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.
భాస్కర్‌రెడ్డి కూడా ఈ కేసుకు సంబంధించిన పలు అంశాలను తన దృష్టికి తీసుకొచ్చారని విజయసాయిరెడ్డి చెప్పారు. సాదిక్ గ్రూప్‌కు సంబంధించి మరో 15 కేసుల వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీకి అధికారికంగా వినతిపత్రం సమర్పిస్తానన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోతే కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాలని బాధిత కుటుంబ సభ్యులకు సూచిస్తానని చెప్పారు.
రాష్ట్ర పోలీసుల సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడటం తన ఉద్దేశం కాదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యకలాపాలకు ఇతర రాష్ట్రాలు, విదేశాలతో సంబంధాలు ఉన్నాయని చెబుతున్నందున కేంద్ర సంస్థల దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు.
దర్యాప్తులో తేలాల్సిన కీలక అంశాలు
- సాదిక్‌కు షూటింగ్ స్కూల్ లైసెన్స్ ఇప్పించేందుకు సిఫారసు చేసింది ఎవరు? అన్నది మొదటగా దర్యాప్తు చేయాలని విజయసాయిరెడ్డి కోరారు.
- షూటింగ్ స్కూల్‌లో ఎలాంటి కార్యకలాపాలు జరిగాయి? అక్కడ చట్టబద్ధమైన కార్యకలాపాలతో పాటు మరే ఇతర కార్యకలాపాలు నిర్వహించారా అనే అంశాన్ని పరిశీలించాలన్నారు.
- కొన్నేళ్ల క్రితం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తిగా చెప్పబడుతున్న సాదిక్‌కు ప్రస్తుతం కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా సమకూరాయి? అతని ఆదాయ వనరులపై విచారణ జరగాలని కోరారు.
- సంపాదించిన డబ్బును ఎక్కడ, ఎలా వినియోగించారు? అనే అంశంపైనా దర్యాప్తు జరగాలని అన్నారు.
- దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఉన్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? అనే విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు తేల్చాలని కోరారు.
ఈ అంశాలన్నింటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారికంగా విజ్ఞప్తి చేస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. స్పందన లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతామని ఆయన వెల్లడించారు.